Saturday 25 March 2017

పలకరింపు

ఇంజనీరింగు కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న కమల్ తన విధులను నిర్వర్తించి ఇంటికి చేరుకున్నాడు.కాలింగ్ బెల్ మోగగానే ,కమల్ భార్య పుష్ప ‘’బాబు అనిల్ తలుపుతీయమ్మా నాన్న వచ్చేశారు’’ అని వంట గది లోంచి అరిచింది.
“అబ్బా! ఏంటమ్మా ఎప్పుడూ ఆట మధ్యలో పని చెబుతావు’’ అని విసుగుకుంటూ,సెల్ ఫోన్ ని చేతిలో పట్టుకొని అందులో ఆటలు ఆడుకుంటూ తలుపు తీశాడు అనిల్.
లోపలకి వస్తూ కమల్ పదవతరగతి చదువుతున్న తన కొడుకుని “ఎలా చదువుతున్నావు అనిల్’’,అంటూ ఇంకా ఏదో అడగబోతుంటే, అంతా ఒకే డాడీ అంటూ దించిన తల ఎత్తకున్నా సెల్ లో ఆటలు ఆడుతూ సమాదానమిచ్చాడు.
ఇంక ఆరవ తరగతి చదువుతున్న తన చిన్న కొడుకు సునీల్ టి‌వి లో వస్తున్న కార్టూన్ షోని చూస్తూ, తండ్రి రాకనే గమనించలేదు.
కాఫీ పెట్టమంటారా! అంటూ వంట గదిలోంచి వచ్చి కమల్ చేతిలోంచి బ్యాగ్ తీసుకుంటూ అడిగింది పుష్ప.
కాఫీ పెట్టమని చెప్పి ,బ్యాగ్ ను భార్యకు అందించి,స్నానము చేసి,గదిలో మంచము మీద నడుము వాల్చాడు కమల్.
పుష్ప కాఫీ తెస్తుందని ఎదురు చూస్తూ చిన్న కునుకు తీశాడు కమల్.
హఠాత్తుగా “ఏమండీ , ఏమండీ” అన్న పిలుపుతో ఉలిక్కి పడిలేచిన కమల్ కి ఎదురుగా కాఫీ కప్పుతో నిల్చుని కనిపించింది పుష్ప.
కాఫీ ని కమల్ కి అందిస్తూ “కాఫీ తేవడం కాస్త ఆలస్యమయ్యేసరికి అలా నిద్రపోతే ఎలాగండి,నేను పనిలో పడి మరిచిపోయాను,మీరైన కాస్త వంట గది లోకి వచ్చి అడగవచ్చు కదా!అలా ఈ గదిలోనే ఉండక పోతే’’అన్న భార్య మాటలు విన్న కమల్ విరక్తిగా ఒక నవ్వు నవ్వి కాఫీ అందుకుని తాగేసాడు.
మారు మాట్లాడకున్నా మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. “ఏమయ్యింది ఈయనకి’’ అని గెడ్డము మీద చెయ్యివేసుకుని ఆలోచిస్తూ వంట గదిలోకి వెళ్ళిపోయింది పుష్ప.
పుష్ప,కమల్ లది చూడముచ్చటైన జంట. పుష్పని బంధువుల పెళ్ళిలో కమల్ చూసి ఇష్టపడి పెద్దలతోతన మనసులోని మాటను చెప్పి, సంబంధం కుదుర్చుకుని పుష్ప అంగీకారముతో ఆమెను వివాహమాడాడు. చూడడానికి ఇది పెద్దలు కుదిర్చిన వివాహమైన,ఒక రకముగా ప్రేమ వివాహమనే చెప్పాలి,ఎందుకంటే బందువుల పెళ్ళిలో కమల్ చూసిన ఓరచూపులు ఆమె మనస్సుని కూడా తాకాయట, పెద్దల ద్వారా కమల్ సంప్రదించడం అన్నీ నచ్చి పెళ్ళికి అంగీకరించాను అని చెప్పింది పుష్ప వివాహమైన తరువాత కమల్ తో.
కమల్ చదువులో మంచి ప్రావీణ్యుడు. బి.టెక్,ఎమ్.టెక్ పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకుని ఒక ఇంజనీరింగు కళాశాలలో ఉపాధ్యాయుడుగా చేరి,తరువాత పుష్పను వివాహమాడి,ఆమె సహకారముతో పీ హెచ్ డి డిగ్రీని పూర్తి చేసి తన వృత్తిలో అంచెలంచెలుగా ఎదుగుతూ అనతి కాలములోనే ఇంజనీరింగు కాలేజీకి ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగిపోయాడు కమల్.
పుష్ప రాత్రి వంట చేస్తూ ఇలా ఆలోచించసాగింది “ఈ మద్యన ఈయన ఎందుకు చాలానీరసముగాఉంటున్నారు.ఇదివరకటిలా హుషారుగా లేరు.నాతో కూడా సరిగ్గా మాట్లాడడము లేదు.కాలేజీ లో ఏమయినా సమస్య వచ్చిందా! ఎందుకంటే ఇంజనీరింగు కళాశాలకి ప్రిన్సిపాల్ కదా!విద్యార్ధులతో ఏమయినా సమస్యలున్నాయా,లేకపోతే సిబ్బందితో ఏమైనా ఇబ్బందులా,యాజమాన్యముతో ఏమయినా............,లేదు లేదు అలాంటివి ఏమయినా ఉంటే ఖచ్చితముగా నాతో చెబుతారు.మరి ఏమయింటుండబ్బా!ఈమద్యన మా అమ్మ కూడా ఒకసారి నాతో ఫోన్ లో చెప్పింది అల్లుడు గారు ఇదివరకటిలా హుషారుగా లేరు,మీ ఇద్దరి మధ్యన ఏమయినా గొడవ జరిగిందా అని....,అలాంటిది ఏమి లేదమ్మా అని అమ్మ కి సర్ది చెప్పాను కానీ,ఇప్పుడనిపిస్తుంది ఈయన చాలా రోజుల నుండి దిగులుగా ఉంటున్నారు. ఈ రోజు రాత్రికి మావారితో మాట్లాడాలి” అని అనుకుంటూ వంట పని ముగించి, చిన్నోడికి ఏదో ప్రోజెక్ట్ ఉందంట స్కూల్లో ఇచ్చారంట,వాడికి ఆ పనిలో సహాయము చేసేసరికి ఇంకేముంది బోజనాల సమయమయ్యింది.
పిల్లలిద్దరికి అన్నము వడ్డించి,కమల్ ని కూడా బోజనానికి పిలిచింది.పుష్ప పిలిచిన కాసేపటికి కమల్ హాల్లోకి వచ్చి బోజనము చేసి మళ్ళీ తన గది లోకి వెళ్లిపోయాడు.
పుష్ప తన పనులను త్వరగా ముగించుకుని,పిల్లలిద్దరూ పడుకున్నాక అన్ని తలుపులు వేసేసి,గదిలోకి వెళ్ళేసరికి కమల్ టి‌వి చూస్తూ కనిపించేసరికి మనసులో హమ్మయ్య ఈయన మేల్కొనే ఉన్నారు అని ఊపిరి పీల్చుకుంది. పుష్ప కమల్ పక్కన కూర్చుంది ,భార్య రాకని గమనించిన కమల్ ఒక చిన్న అరనవ్వు నవ్వాడు. బదులుగా పుష్ప కూడా ఒక చిరు నవ్వు నవ్వి “ఏమయిందండి ఎందుకలా ఉంటున్నారు?ఆరోగ్యము బాగులేదా?కాలేజీ లో ఏమయినా సమస్యాలా?నా వలన ఏమయినా పొరపాటు జరిగిందా?” ఇలా చాలా ప్రశ్నలు వేసింది.
“నేను బాగానే ఉన్నాను.నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు’’ అని సమాదానమిచ్చి కమల్ పడుకుండి పోయాడు.
చేసేది ఏమీ లేక పుష్ప కూడా నిద్రలోకి జారుకుంది. తెల్లవారింది ఎప్పటిలాగే ఎవరి పనులలోకి వాళ్ళు జారుకున్నారు.
ఇలా కొన్ని రోజులు గడిచాయి. కమల్ లో ఎటువంటి మార్పు లేదు.పుష్పకి దిగులు వేసింది.ఎంతో చలాకీగా హుషారుగా ఉండే భర్త ఇలా విచారముగా ఉండడము.తనకేమీ అర్ధము కాక లోలోపలే మధన పడసాగింది పుష్ప. ఒక్కోసారి విపరీతమైన కోపముతో పిల్లవాడిమీద కూడా చేయి చేసుకోబోయి మళ్ళీ తనని తాను తమాయించుకుంది.
ఒక రోజు కమల్ తో “ఏమండీ ఏదయినా ఆరోగ్య సమస్య అయితే డాక్టర్ ని కలుద్దామా’’ అని అడిగింది
“నేను బాగానే ఉన్నానుగా డాక్టరు దగ్గరకు ఎందుకు,అయినా పదే పదే నువ్వు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు.నాకు ఆరోగ్యము బాగులేక పోతే నీకు చెప్పనా?,చిన్న పిల్లవాడిని అడిగినట్లు నన్ను అడుగుతున్నావు నువ్వు’’ అని కమల్ అనేసరికి పుష్పకి ఏమి సమాధానము చెప్పాలో అర్దము కాక ఊరుకుంది.
కమల్ ,పిల్లలు వెళ్ళిన తరువాత పనులన్నీ పూర్తి చేసుకుని కాస్త నడుము వాల్చి ఇప్పుడు ఏమిచేయాలి అని కమల్ గురించి ఆలోచిస్తూ ఉండగా, ఫోన్ రింగవడముతో ఎవరైఉంటారనుకుని ఫోన్ చూసేసరికి తన స్నేహితురాలు విమల చేసింది. ఆమెతో మాట్లాడుతుందే గాని ఆలోచనలు మాత్రం కమల్ చుట్టూ తిరుగుతున్నాయి.
అది గమనించిన విమల “ఏమయిందే పరధ్యానముగా ఉన్నావు’’ అని అడిగేసరికి పుష్ప “ఏమీ లేదే అని ఇంకేమిటి సంగతులు’’ అని మాట్లాడి ఫోన్ పెట్టేసింది పుష్ప.
విమలకి అనుమానము వచ్చింది ఏదో జరిగింది పుష్పకి,లేకపోతే ఇలా మాట్లాడదు తను,పుష్ప తన చిన్ననాటి స్నేహితురాలు,ఇద్దరి వివాహాలు వాళ్ళు పుట్టి పెరిగిన ఊర్లలోనే జరిగాయి.ఇద్దరి అత్తగార్లది ఒకే ఊరు అయిన కమల్ ఉధ్యోగ రీత్యా పుష్ప సొంతఊరికి దూరముగా వెళ్ళిపోయారు,విమల భర్త వ్యాపారము అవడము వలన అదే ఊరిలో ఉండి పోయారు.అందుకే పుష్ప గురించి విమలకి బాగా తెలుసు.ఏదయినా సమస్య ఉంటే తనలోనే భాదపడుతుంది,లేదా తానే పరిష్కరించుకుంటుంది తప్ప ఎవరికి చెప్పదు,ఎవరిని ఇబ్బంది పెట్టదు.అయితే ఈ మధ్య వాట్స్ ఏప్ లో కూడా మెసేజులు పుష్ప పెట్టక పోవడముతో ఏమయింది అని తెలుసుకోవడానికి కాల్ చేసింది విమల.
ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత,ఒక రోజు కమల్,పిల్లలు అందరూ వెళ్లిపోయాక కూర్చుని పేపర్ చదువుతున్న పుష్ప కాలింగ్ బెల్ మోగేసరికి ఇప్పుడెవరైఉంటారబ్బా అని తలుపు తెరిచే సరికి ఎదురుగా విమల తన భర్తతో ప్రత్యక్షమైంది. ఇంక ఆశ్చర్యపోవడం పుష్ప వంతయింది.
“ఇక్కడే నిలబెడతావా లేక లోపలకి పిలిచేదెమయిన ఉందా అన్న విమల మాటతో ఒక్కసారి ఉలిక్కిపడిన పుష్ప “క్షమించండి’’ అని చెప్పి కంగారుగా ఇద్దరినీ లోపలికి తీసుకువెళ్లింది.
“ఏమిటే ఇలా హఠాత్తుగా చెప్పా పెట్టకుండా వచ్చేసింది అని అనుకుంటున్నావా!,ఏమి చెయ్యను నువ్వు ఫోన్ లో సరిగ్గా మాట్లాడడం లేదు కదా!అందుకే విషయం తెలుసుకుందామని నేరుగా వచ్చేశాను’’ అని విమల అనేసరికి పుష్ప కంగారుగా,ఏమి చెప్పాలో తెలియక బిత్తర చూపులు చూస్తుంటే,విమల భర్త శేకర్ ‘ఏంటి విమల నువ్వు పుష్పగారిని అలా భయపెడతావెందుకు, అలాంటిదేమీ లేదండీ రేపు మా బంధువుల ఇంట్లో పెళ్లి.అబ్బాయిది ఈ ఊరే ,అందుకే వివాహము ఇక్కడ జరగనుంది.ఈ విషయము తెలిసిన నుండి విమల ఆనందానికి అవదులే లేవు,వాళ్ళు ఉండడానికి మాకు హోటల్ లో రూమ్ ఇచ్చినా, విమల “నేను పుష్ప వాళ్ళింట్లోనే దిగుతాను’’ అని పట్టుపట్టి మరీ ఇక్కడికి తీసుకిని వచ్చింది.పోనీ మనము వస్తున్న విషయమైనా తెలియపరుచు అని చెప్పినా,వద్దు “హఠార్తుగా వెళ్ళి పుష్పని ఆశ్చర్య పరుస్తాను’’ అని చెప్పిందని’’ అని చెప్పాడు.
పుష్పకి చాలరోజులకి తన స్నేహితురాలు కలవడముతో మనసులో ఎంతో సంతోషించింది.వాళ్ళ స్నానాలు,కాఫీలు,టిఫిన్లు ముచ్చట్లు అన్నీ అయ్యాక శేకర్ ‘’నేను అలా పెళ్లి వారింటికి వెళ్ళి ముఖము చూపించి వస్తాను,నీ ముచ్చట్లు అయ్యాక తయారై ఉండు కలిసి వెళదాము’’ అని విమలకి చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు.
‘’ఇప్పుడు చెప్పవే విషయము ఏంటి’’ అన్న విమల ప్రశ్నకు ఏమిటి అన్నట్లుగా ఆశ్చర్యము గా చూసింది పుష్ప.
‘’ఏ విషయము’’ అని పుష్ప అడిగేసరికి “నువ్వు ఎవరితోనూ చెప్పకుండా నీలోనే నువ్వు భాదపడుతున్న విషయం’’ అని విమల అనేసరికి పుష్ప “ఏమీ లేదే అంతా బానే ఉంది’’ అని కంగారుగా సమాదానమిచ్చింది. “నీ ముఖము,నీ కంగారూ చెబుతున్నాయే ఏదో ఉందని చెప్పు’’ అని ఎంతో బ్రతిమలాడిన తరువాత మొత్తము తన మనసులోన భాదనంతా పుష్ప విమలతో విన్నవించుకుంది.జరిగినదంతా చెప్పింది.
అంతా విన్న విమల “అయితే నాకు తెలిసిన మంచి మానసిక నిపుణుడు ఉన్నారు.అతని దగ్గరకు తీసుకువెళ్ళు చాలా బాగా చూస్తారు’’ అని చెప్పింది.
“అమ్మో డాక్టరు దగ్గరకు వెళదామని అన్నందుకే ఆయనకి కోపము వచ్చింది.ఇంక మానసిక నిపుణుడు వద్దకు అంటే ఇంకేమయిన ఉందా!’’ అని పుష్ప అనేసరికి “అదీ నిజమేలే నువ్వు మాత్రం ఎలా ఒప్పిస్తావు లే’’ అని ఆలోచించసాగింది.
అంతలోనే విమల మెదడులో మెరుపులాంటి ఆలోచన తట్టి “పుష్పతో నేను చెప్పిన డాక్టరు ఈ పెళ్ళికి రేపు వస్తున్నారు ఇక్కడకి.నువ్వు కమల్ గారు అక్కడికి వస్తే అక్కడ ఆయన్ని కలవవచ్చు మనం’’ అని చెప్పింది.
“మీ బంధువుల పెళ్ళికి మేము ఎలా వస్తామే’’ అన్న పుష్ప ప్రశ్నకి “అవన్నీ నేను చూసుకుంటాను పెళ్లివాళ్లు మాకు చాలా దగ్గరి వాళ్ళు,నా స్నేహితురాలు ఇక్కడ ఉంది అని చెప్పి మీకు ఆహ్వానము వచ్చేలా చేస్తాను,నువ్వు ఆ విషయాలన్నీ నాకు వదిలేయు నేను చూసుకుంటాను’’ అని చెప్పి తయారవడానికి గదిలోకి వెళ్లిపోయింది విమల.
మొత్తానికి విమల ఇచ్చిన మాట ప్రకారము పుష్ప వాళ్ళకి పెళ్ళికి ఆహ్వానము రావడము,పెళ్ళికి వెళ్లడానికి కమల్ ని ఒప్పించడము,పెళ్ళికి వెళ్ళడము అన్నీ జరిగిపోయాయి.పెళ్ళిలో శేకర్ కమల్ ని అందరికీ పరిచయము చేయిస్తూ,విమల చెప్పిన డాక్టర్ అరవింద్ ని కూడా పరిచయము చేశాడు,అంతలోనే ఎవరో పిలుస్తున్నట్లుగా శేకర్ “మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను’’ అని చెప్పి అరవింద్ ని కమల్ ని వదిలేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు.
విమల,శేకర్ అరవింద్ కి మొత్తం కమల్ గురించి ముందే చెప్పి ఎలాగయిన పరిష్కారము చూపాలని అభ్యర్దించడముతో బంధువులవ్వడముతో అరవింద్ అందుకు అంగీకరించాడు. మొదట అరవింద్ కమల్ తో మాటలు మొదలు పెట్టాడు.ఇద్దరి మాటలు బాగా కలవడము తో కమల్ కి అక్కడ ఉన్న ఎవరు తెలియక పోవడముతో అరవింద్ తో మాటలు కొనసాగించాడు. “అలా కూర్చుని మాట్లాడుకుందామా’’ అని అరవింద్ అనడముతో కమల్ సరే అని ఇద్దరు కూర్చుని మాటలు కొనసాగించారు.అరవింద్ మానసిక నిపుణుడు కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలో,ఏమి మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందో తెలుసు కాబట్టి కమల్ తో తన ఉధ్యోగము తో ప్రారంభించి,తన నుండి అన్ని విషయాలు రాబట్టాడు.ఇద్దరూ చాలా సమయము మాట్లాడుకున్నారు.తరువాత పెళ్లి తంతు ముగిసింది ఎక్కడి వాళ్ళు అక్కడికి చేరుకున్నారు.అరవింద్ తో మాట్లాడిన తరువాత కమల్ ముఖము కొంచెము ప్రశాంతముగా కనిపించింది పుష్పకి.
మరుసటి రోజు కమల్,పిల్లలు వెళ్ళిన తరువాత ముందుగా అనుకున్నట్లుగానే విమల,పుష్ప అరవింద్ గారిని కలవడానికి బందువుల ఇంటికి బయలుదేరారు. అక్కడ అరవింద్ ని కలవగానే అలా బయట లాన్ లో కూర్చుని మాట్లాడుకుందామని చెప్పి విమలని,పుష్పకి చెప్పి ముగ్గురూ లాన్ లో కూర్చున్నారు.పుష్పతో అరవింద్ “చూడండి పుష్పగారు మీ భర్త కమల్ గారికి ఎటువంటి సమస్యా లేదు,ఆయన చాలా బాగున్నారు అనగానే పుష్ప లోలోపలే చాలా ఆనందపడిపోయింది.అంతలోనే మరి ఎందుకు అలా ఉంటున్నారనే ప్రశ్న మెదిలేసరికి మనసులో విచారపడింది.

“చూడండి పుష్పగారు మీవారికి వచ్చిన సమస్య ఏమిటంటే,మీవారితో చాలా సమయము మాట్లాడిన తరువాత నాకు అర్ధమయినదేమిటంటే మీ వారుకొంత ఒంటరి తనముతో బాధపడుతున్నట్లు నాకు అని పిస్తుంది.మీరు చెప్పండి మీ పెళ్ళయిన కొత్తలో మీ వారి తో మీరు ఎలా ఉండేవారు అని అడగగానే, మా వారిది గలగలా మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావము.మాకు పెళ్లి అయిన మొదట్లో నేను మావారు బాగా మాట్లాడుకునే వాల్లము. ఆయన తన మనసులో ప్రతీ మాట నాతో చెప్పుకునే వారు.నేను అలానే నా మనసులో మాటని ప్రతీదీ ఆయనతో పంచుకునేదాన్నిఅని సమాధానమిచ్చింది పుష్ప.మీవారితో ఎక్కువ సమయము గడిపేవారు.మీరుఇరువురు చాలా అన్యోన్యముగా ఉండేవారు.అంతవరకు బాగానే ఉంది.ఆతరువాత ఆయనతో సమయము ఎలా గడుపుతున్నారు అని డాక్టరు గారి అడిగిన ప్రశ్నకు రోజులు గడిచేకొద్ది మాకు పిల్లలు పుట్టడము వలన నాకు పని భారము,ఒత్తిడి పెరగడము వలన నేను మా వారితో గడిపే సమయము తగ్గింది.ఇంట్లో పెద్దవారు ఎవరూ లేనపుడు పిల్లలని నేనే చూసుకోవాలికదా!అని పుష్ప సమాదానము ఇచ్చింది.అదే మీరు చేస్తున్న తప్పు.మీవారితో మీరు సమయము గడిపి చూడండి ఆయనలో మార్పు తప్పక వస్తుంది. ఇంక కమల్ గారి ఆఫీసు విషయానికి వస్తే ఆయన వృత్తి ప్రిన్సిపాల్ అవ్వడము వలన తన కింద పని చేసే వారితో మనసువిప్పి మాట్లాడలేరు,ఎందుకంటే వాళ్ళతో పనిచేయించుకోవాలికదా! ఇంక వాళ్ళ అమ్మ,నాన్న అన్నయ్య,చెల్లి ఇలా రక్తసంబంధీకులందరికి తన ఉధ్యోగరీత్యా దూరముగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది.అందువలన వాళ్ళనీ తరచుగా కలవలేకపోవడము వలన తన మనసువిప్పి మాట్లాడే అవకాశమే కుదరడము లేదు.ఇంక మీ పిల్లల విషయానికి వస్తే వాళ్ళు వాళ్ళ నాన్నతో సమయము గడుపుతారా అని డాక్టరు గారు అడగగానే వాళ్ళు చిన్నపిల్లలగా ఉన్నప్పుడు కమల్ తో బాగానే సమయము గడిపేవారు.కానీ వాళ్ళు పెద్దవాల్లయ్యే సరికి,పెద్దబాబు మొబైల్ ఫోన్ లో ఆటలు,వాట్ట్సాప్ ,ఫేసుబుక్ అంటూ వాటిలోనే సమయము గడుపుతున్నాడు,ఇంక చిన్నవాడు నిత్యం టి‌వి లో వచ్చే కార్టూన్లు చూస్తూ,కాలము గడుపుతున్నాడు ఇంకా చెప్పాలంటే నేను కూడా ఈ మధ్యన వాట్సాప్ లో కొంత సమయము గడుపుతున్నాను.అది చూసి ఆయన కూడా గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు అని చెప్పింది పుష్ప.మరి అందరూ అలా చేయడము వలన కమల్ ఒంటరివారయ్యారు.ఇంక చేసేదేమీ లేక ఆయనకూడా వాట్సప్ ని అలవాటు చేసుకున్నారు.ఇలా అందరూ ఉన్నా,తన మనసులోని మాటలని చెప్పుకునేవారు లేక ఒంటరివారయిపోవడమువలన ,ఒక రకమయిన విరక్తి భావనలోకి వెళ్ళిపోవడము వలన కమల్ అలా ప్రవర్తిస్తున్నారు.చూడండి పుష్పగారు మీవారికి వచ్చిన సమస్య పెద్దది అని నేను అనను,అలా అని తేలికగా తీసిపారేయవలసినది కాదు.ఇది చాలా సున్నితమైన సమస్య.అలా అని నిర్లక్ష్యము చేస్తే మంచిది కాదు.
అదునాతనమైన పరికరములు,ఇంక సామాజిక అవసరాల నిమిత్తము మనిషి ఎన్నో ఉపయోగకరమైనవి కనుగొన్నాడు.విజ్ఞాన రంగములో ఎంతో పురోగతిని సాధించి,ఎన్నో పరిశోధనలు చేస్తూ ఎంతో అభివృద్దిని సాధిస్తూనే ఉన్నారు.కానీ వాటిని మనము ఎంతవరకు అవసరమో,అంతవరకే వినియోగించుకోవాలి.అతిగా వాడకూడదు.ఇదివరకు వెనకటి రోజులలో సాయంత్ర మయ్యేసరికి అందరూ తమ పనులు పూర్తి చేసుకుని ఆరుబయట కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునేవారు.కానీ ఇప్పుడు ఎవరి ఇళ్ళల్లో,వారే తలుపులు బిగించుకుని కూర్చుని టి‌వి లకి మొబైల్ ఫోన్లకి అతుక్కుపోతున్నారు.మొబైల్ ఫోన్ల వలన రేడియేషన్,స్పోండిలైటీస్,కంటి చూపు దెబ్బతినడం,రోడ్డు ప్రమాదాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.అయిన వాటిని వినియోగించకుండా ఉండలేని పరిస్థితిని కల్పించుకుంటున్నారు.మనము వాటిని వినియోగిస్తున్నాము,మన పిల్లలకి అందిస్తున్నాము. ఆయనతో, మీరు మీ పిల్లలు సమయము గడపండి. బంధువులను తరచూ కలుస్తూ ఉండండి.ఆనందముగా గడపండి’’.అని చెప్పి డాక్టరుగారు పుష్ప చేతిలో ఒక చీటి పెట్టారు.పుష్ప ఆ చీటిని తీసుకుని డాక్టరుగారికి ధన్యవాదములు తెలిపి విమలని తీసుకుని బయలుదేరింది.బయటకి వచ్చిన తరువాత డాక్టరు గారు ఇచ్చిన చీటిని చూసిన పుష్ప ఆశ్చర్యపోయింది,తరువాత నవ్వుకుంది.ఇంటికి చేరుకుంది.విమల,శేకర్ తమ ఊరికి తిరుగు ప్రయాణమయ్యారు. పుష్ప విమలని దగ్గరకు హత్తుకుని నా సమస్యకు మంచి పరిష్కారము చూపించావు అని తన ఆనందాన్ని తెలుపుకుంది. డాక్టర్ అరవింద్ చెప్పిన విషయాలను తన పిల్లలకు అర్దమయ్యేటట్లు వివరించి,కమల్ తో పిల్లలు ఎక్కువ సమయము గడిపే విదముగా వాళ్ళను తీర్చిదిద్దింది పుష్ప.ఇంకా తను కూడా కమల్ తో వీలయినంత సమయము గడపడానికి ప్రయత్నించింది.నెమ్మ నెమ్మదిగా కమల్ లో మార్పును గమనించింది పుష్ప.తన భర్త లో మునుపటి సంతోషము,ఉత్సాహము రావడముతో తన స్నేహితురాలికి,డాక్టరుగారికి మనసులోనే ధన్యవాదములు తెలుపుకుంది. ఇంతకీఆ చీటీలో ఏముందనుకుంటున్నారు!
టాక్ –అదేనండీ మనసువిప్పి మాట్లాడుకోండి.
స్మైల్ –మనసారా నవ్వండి
లివ్ –హాయిగా జీవించండి
విషింగ్ –మనిషి మనిషి పలకరించుకోండి.
ఇక్కడ సమస్య కమల్ ది .ఇంకో ఇంట్లో పుష్పది అయ్యుండవచ్చు.సమస్య ఎవరిదైనా కావచ్చు.మంచి తరుణం మించిపోకముందే తేరుకోండి.

No comments:

Post a Comment